ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ సంవత్సరం నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ఈసారి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆమెతో అనేక ప్రశ్నలు పంచుకున్నారు. తాజాగా ఈ పూర్తి ఎపిసోడ్‌ను ప్రధాని తన అధికారిక “ఎక్స్” (ట్విట్టర్) ఖాతా ద్వారా విడుదల చేశారు. దీపికా ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. తాను మానసిక ఆందోళన అనుభవించిన రోజులు గుర్తు చేసుకుంటూ “ఆ సమయంలో నేను చాలా కుంగిపోయాను. ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయి” అని పేర్కొన్నారు.అప్పుడు ఒత్తిడి ఎలా జయించాలో ఆందోళన సమయంలో ప్రశాంతంగా ఉండటానికి కొన్ని కీలక సూచనలను విద్యార్థులకు ఇచ్చారు.దీపికా తన అనుభవాన్ని వివరిస్తూ “స్కూల్ చదవడం, క్రీడలు, మోడలింగ్, సినిమా రంగం ఇలాంటి అనేక మార్పులు నేను చూసాను.
2014 వరకు జీవితం బాగా సాగింది. కానీ, ఆ తరువాత ఒక రోజు నేను కుప్పకూలిపోయాను. అప్పుడే నాకు కుంగుబాటు సమస్య ఉందని తెలిసింది,” అని చెప్పుకున్నారు.”ముంబయిలో ఒంటరిగా ఉండటం వల్ల, చాలా కాలం పాటు ఈ సమస్యను ఎవరికీ చెప్పలేకపోయాను. ఒకసారి మా అమ్మ ముంబయికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, ఆమెను పట్టుకుని బాగా ఏడ్చా. ఆ రోజు నా బాధను మొదటిసారిగా అమ్మతో పంచుకున్నాను. ‘నేను నిస్సహాయంగా ఉన్నాను జీవితం పై ఆశ లేదు బతకడానికి ఆత్మవిశ్వాసం లేదు’ అని చెప్పాను,” అని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆ సమయంలో మానసిక ఆరోగ్యంపై ఈ అభిప్రాయాలను పంచుకున్న దీపికా, “ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు ఇవి ప్రతి ఒక్కరూ ఒక దశలో ఎదుర్కొంటారు. వాటికి భయపడవద్దని, ఈ పరిస్థితిని మనం పంచుకుంటేనే మన భారం తగ్గిపోతుందని చెప్పింది. సమస్యను దాచిపెట్టి బాధపడితే ఏమీ సాధించలేమని, ధైర్యంగా బయట చెప్పాలని ఆమె సూచించారు.”ఈ మాటలు ఇప్పుడు అనేకమందికి మార్గదర్శిగా నిలుస్తున్నాయి, ఎందుకంటే మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరిగే సమయం ఇది.